కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను అప్పగించేందుకు భారత్ అంగీకరించింది. అందుకు రెండు కండీషన్లు పెడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సమాచారం పంపించింది. ఒకటి.. షేక్ హసీనా అప్పగింత పూర్తిగా అధికారికంగానే జరగాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్‌కు పంపించాలి. రెండోది.. తనకు విధించిన మరణ శిక్ష, ఇతర కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ సహాయం తీసుకునే అవకాశం షేక్ హసీనాకు కల్పించాలి. తన వాదనలు స్వేచ్ఛగా కోర్టుల్లో వినిపించుకునేలా సానుకూల వాతావరణం ఉండాలి. ఈ రెండింటిపై తగిన హామీ లభిస్తే.. షేక్ హసీనాను అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై ఢాకా నుంచి సమాధానం రావాల్సి ఉంది.
ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం..
షేక్ హసీనాను వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్ భావిస్తోంది. ఆమె ఇంకా ఢిల్లీలోనే ఉంటే, ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయ పడుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతుండటం, మరోవైపు ఆమెకు ఆ దేశ కోర్టుల్లో శిక్షలు పడిన నేపథ్యంలో అప్పగింత ప్రక్రియను మరింత జఠిలంగా మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే షేక్ హసీనా అప్పగింత జరగాలని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా ప్రభుత్వానికి వర్తమానం పంపించింది. 2024లో చోటు చేసుకున్న అల్లర్ల కారణంగా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఉన్నఫళంగా భారత్ వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఒక రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు.

