కలం, నర్సాపూర్ (జి) : విద్యాభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) అన్నారు. శనివారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో రూ.56.85 లక్షల వ్యయంతో నిర్మించనున్న బాలికల విద్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి టాపర్లుగా నిలిచిన కావేరి (ఎంపీసీ), కీర్తన (బైపీసీ)లను శాలువాలతో సత్కరించి అభినందించారు.
విద్యార్థినులు ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మహిళా సంఘాల బలోపేతానికి నిర్మించనున్న వీఓ భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచ్ ఇంద్రకరణ్‌రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్, బీజేపీ మండల అధ్యక్షుడు నరేందర్, బీజేపీ నాయకులు అర్జున్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

