కలం, అశ్వారావుపేట: అశ్వారావుపేటకు చెందిన ఓ చిన్నారి చదరంగంలో తన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని (Aswaraopeta) తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోషిత చెస్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. చిన్నప్పటి నుంచే చదరంగంపై ఆసక్తి పెంచుకున్న రోషిత ఇప్పటివరకు రెండు ఆల్ ఇండియా స్థాయి, రెండు అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో (Chess Tournaments) పాల్గొని తన సత్తా చాటింది. ఈ విజయాల వెనుక తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, కోచ్ మహమ్మద్ ఫయాజ్, ప్రిన్సిపల్ సంగీత ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని ఆమె తెలిపింది.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తమలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో మరింత కష్టపడి చెస్‌లో ఉన్నత స్థాయికి చేరుకుని గ్రాండ్‌మాస్టర్‌గా ఎదగడమే తన లక్ష్యమని రోషిత ధీమా వ్యక్తం చేసింది. ఆమె ఏకాగ్రత, పట్టుదల తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

