కలం, వెబ్ డెస్క్: భారత్ సమ్మిట్ నిర్వహించడంతో తెలంగాణకు ఏం లాభం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీయడానికే సమ్మిట్ నిర్వహించారంటూ మండిపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులను సమ్మిట్‌కు పిలిచారని, వారిలో ఎవరూ పెట్టుబడిదారులు కాదని స్పష్టం చేశారు. దేశాన్ని విమర్శించేందుకు సమ్మిట్ పెట్టినట్లుగా ఉందన్నారు. దేశంలోని వ్యవస్థలు కుప్పకూలినట్లు రాహుల్ మాట్లాడారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఏం జరిగిందో ఆయన ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందన్నారు.
అలాంటి వారికి అనుమతి ఉండదు..
ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలను అప్పుడు జైళ్లలో పెట్టారని గుర్తు చేశారు. ఎవరికీ వీసాలు ఇవ్వాలో, ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధివిధానాలు ఉంటాయన్నారు. వాటి ప్రకారమే కేంద్రం మంజూరు చేస్తోందన్నారు. భారత్‌ను అగౌరవపరిచే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడకు అనుమతించేది లేదన్నారు. ప్రపంచ దేశాల ముందు ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నియంతృత్వ పార్టీ అని, ఎమర్జెన్సీ సమయంలో ఎలా ఎన్నికలు నిర్వహించేదో మర్చిపోయారా..? అని ఎద్దేవా చేశారు.

