కలం, కరీంనగర్: ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన గంజాయి, హుక్కా, మట్కా వంటి కార్యకలాపాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ జోరుగా సాగుతున్నాయని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ప్రభావంతో యువత పెడదారి పడుతోందని పేర్కొన్నారు. నగరంలో పేకాట స్థావరాలు, ఆన్లైన్ మట్కా కేంద్రాలు కొనసాగుతున్నాయని, జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పటిష్టం చేసి గంజాయి మాఫియా, హుక్కా కేంద్రాలు, పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్కా కారణంగా మధ్యతరగతి, పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలోని కొన్ని కేఫ్‌లలో హుక్కా కేంద్రాలు నిర్వహిస్తున్నారని, రేకుర్తి వీపార్క్ వెనుక పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. పేకాటలో పట్టుబడిన వారి నగదు, సెల్ఫోన్లు సీజ్ చేసి చిన్నచిన్న కేసులు నమోదు చేసి వదిలేయడం వల్ల జూదరుల్లో భయం లేకుండా పోయిందని అన్నారు. స్థావరాలపై దాడులు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం గంజాయి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సత్యం.. పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి నగరాన్ని డ్రగ్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

