కలం, అచ్చంపేట: నల్లమల అడవి ప్రాంతంలో దాగి ఉన్న యురేనియం, వజ్రాలు తదితర ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోదీ, రేవంత్ రెడ్డి సర్కార్లు కుట్ర పన్నారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ (Gaddam Laxman) ఆరోపించారు. శనివారం అచ్చంపేట పట్టణం టీఎన్జీఓ భవన్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పచ్చని నల్లమలలో స్వచ్ఛంద పునరావాసం పేరుతో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వైశ్యామ్యాలు సృష్టించి నల్లమల ప్రజలను ఈ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలు తదితర గ్రామాల్లో పౌర హక్కుల సంఘం నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి చెంచుల స్థితిగతులను, గిరిజనేతరుల సమస్యలను పూర్తిస్థాయిలో నిజ నిర్ధారణ చేశామన్నారు. కనీస మౌలిక వసతులైన తాగునీరు, కరెంటు, రోడ్లు ముఖ్యంగా విద్యా వ్యవస్థ దుర్బలమైన పరిస్థితిలో ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. నల్లమల్ల ప్రాంతంలో గిరిజనేతరులకు వారసత్వంగా వస్తున్న భూములను పట్టా చేయకుండా మైదాన ప్రాంతంలో ఉన్న అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చి ఇవ్వడంలో అంతర్యం ఏమిటి అని సూటిగా పాలకులను, అధికారులను ప్రశ్నించారు. నల్లమల ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులకు, గిరిజనేతరులకు సమాన హక్కులు కల్పిస్తే ఇక్కడే ఉంటామని స్వచ్ఛంద పునరావాసం కోరుకుంటున్న ప్రజలు తమ బృందానికి వెల్లడించారని తెలిపారు. స్వచ్ఛంద పునరావాసం కోరుకుంటున్న కుటుంబాలు తమకు ఇస్తామన్న 5 ఎకరాల రెవెన్యూ భూమి పట్టా, 250 చదరపు గజాల ఇంటి స్థలంలో రెండు పడకల గది నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే అక్కడికి వెళ్లాలని వారికి సూచించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నల్లమల ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ పోడు భూముల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతరించిపోతున్న ఆదివాసీ చెంచులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వారు ఉంటున్న చోటే అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యురేనియం వెలికితీత కోసం డీబీర్స్ అనే వజ్రాల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా వెనక్కి పంపామని గుర్తు చేశారు. ముఖ్యంగా చెంచుల కోసం వస్తున్న నిధులను చెంచులకే చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో పాటు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని నల్లమల ప్రజలకు అండగా ఉండాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శులు జక్క బాలయ్య, రమేష్ చందర్, లక్ష్మీనారాయణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

