కలం, కరీంనగర్: హైదరాబాద్ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ను (Bharat Summit) వ్యతిరేకిస్తూ కరీంనగర్ (Karimnagar) జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం నేతృత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నల్లజెండాలు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకావడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంటపాటు సాగిన ఈ ఆందోళనతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు సుమారు 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని, అది ‘దేశవ్యతిరేక సమ్మిట్’ అని ఆరోపించారు. దేశ ప్రధానిని, దేశ అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు, రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరిచే వ్యక్తులకు హైదరాబాద్‌ను వేదికగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి సదస్సుల పేరిట రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. విద్రోహ శక్తులను ఏకం చేసేందుకు వస్తున్న రాహుల్ గాంధీ రాకను దేశభక్తులంతా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వై. సునీల్ రావు, జిల్లా మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్ రావు, కనమళ్ళ గణపతి, ఉపాధ్యక్షులు దుర్శెట్టి సంపత్, ఎర్రబెల్లి సంపత్ రావు, గాజుల స్వప్న, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేష్, జిల్లా కార్యదర్శులు గుంజెటి శివ, కోల అశోక్, చెపూరి సత్యం, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఆకుల రాజేందర్, బత్తుల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ నాయక్, సమీ పర్వేజ్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, అలివేలు సమ్మిరెడ్డి, జాన పట్ల స్వామి, సుధాకర్ పటేల్, ఐటీ ఇన్చార్జి అన్నాజీ వినీత్, కార్పొరేటర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

