కలం, ఖమ్మం బ్యూరో: విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, చదువుతో పాటు సామాజిక స్పృహను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాషా (CPI Leader Sabir Pasha) అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా (Childrens Day Celebrations) శనివారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో ‘భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమి’ (Kothagudem Cricket Academy ) ఆధ్వర్యంలో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. నేటి సమాజంలోని పరిణామాలను, పోకడలను విద్యార్థి దశ నుంచే నిశితంగా గమనిస్తూ మంచి చెడులను విశ్లేషించుకునే విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికత ముసుగులో పెరుగుతున్న చెడు వ్యసనాలకు, మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అసమానతలను ధైర్యంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయని స్పష్టం చేశారు.
నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో ప్రతీ విద్యార్థి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని, అందుకు తగిన కృషితో ముందుకు సాగాలని హితవు పలికారు. విద్యార్థులు తమపై ఉన్న కుటుంబ, సామాజిక బాధ్యతలను గుర్తెరిగి మెలగాలని, సమాజాన్ని మేల్కొలిపే చైతన్యవంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనప్పుడు ఏమాత్రం నిరాశ చెందకుండా దానిని గెలుపునకు తొలిమెట్టుగా మార్చుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు.
అనంతరం మైదానంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిని ఉత్సాహపరుస్తూ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సభ్యులు సాయి నిరంజన్, నర్సిరెడ్డి, నరేందర్, రమేష్, కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, చోటు షరీఫ్ తదితర నాయకులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.

