కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో సగటున 348 AQI పాయింట్లు నమోదవడంతో, గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలోకి జారిపోయింది. మొత్తం 48 పర్యవేక్షణ కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ 300 పాయింట్లను దాటడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా NIH నరేలా ప్రాంతంలో అత్యధికంగా 429 పాయింట్లు నమోదయ్యాయి. కాలుష్యం తీవ్రత పెరగడంతో ప్రజలు కళ్ల మంటలు, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీ NCR పరిధిలో GRAP-1, 2, 3 ఆంక్షలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బొగ్గు, కట్టెల వినియోగంతో పాటు డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, నగరంలో అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం కొనసాగుతోంది.

