కలం, జగిత్యాల : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి అందాల్సిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ (Jagtial Collectorate) ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సురేందర్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రామిల్ల రాంబాబు, కార్యదర్శి ఏశమేని గణేష్ మాట్లాడుతూ.. జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లన్నింటినీ వెంటనే పరిష్కరించి, అర్హులైన కార్మికులకు సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని కోరారు. 50 ఏళ్లు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5000 చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏఎల్ఓ కార్యాలయాల వద్ద కొనసాగుతున్న దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, కార్మికులకు క్యాష్‌లెస్ వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎస్సీ హెల్త్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక సంక్షేమ బోర్డు నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలోని సంక్షేమ బోర్డుల్లో కార్మిక సంఘాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన ఒప్పందాలను రద్దు చేసి, బోర్డు ద్వారానే కార్మికులకు నేరుగా క్లెయిమ్‌లను అందజేయాలని డిమాండ్ చేశారు.
ఆధార్, గ్యాప్ తదితర ధ్రువపత్రాల పరిశీలన బాధ్యతలను ఏఎల్ఓల పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని రామిల్ల రాంబాబు, ఏశమేని గణేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో టీపీఈటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్ మొహియుద్దీన్, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్న మహేష్, ప్రధాన కార్యదర్శి ఎండీ ముక్రం, ఉపాధ్యక్షుడు ఖాతా వినయ్, మామిడి రాజన్న, ఎండీ ఉస్మాన్, కోశాధికారి మాడిశెట్టి కిరణ్ కుమార్, అందె వంశీ, ఎండీ సమీర్, బిజనపెల్లి మనోహర్, గాజులవర్తి రమేష్, మరంపల్లి రాజశేఖర్, గని, ఖాతా యాది, దేవేందర్, మజీద్, అంకం రావు తదితరులు పాల్గొన్నారు.

