గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

కలం, జగిత్యాల : గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై (Jagtial Scanning Centers) కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి, మాతా శిశు సంరక్షణ అధికారి డా.ఎం. జైపాల్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, అనుమతులు, అల్ట్రాసౌండ్ యంత్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పి.సి.ఎన్.డి.టి యాక్ట్ -1994) ప్రకారం గర్భస్థ శిశువు ఆడ లేదా మగ అనే విషయాన్ని నిర్ధారించి వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

స్కానింగ్ సెంటర్లలో వినియోగిస్తున్న అల్ట్రాసౌండ్ యంత్రాలు, వైద్యుల అర్హత ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత శాఖల అనుమతులు, దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఫారం-ఎఫ్ వివరాలను సంబంధిత పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలకు, ఆఫ్‌లైన్ రికార్డుల్లోని వివరాలకు ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని సూచించారు.

అలాగే ప్రతి స్కానింగ్ సెంటర్‌లో రోగులకు స్పష్టంగా కనిపించే విధంగా “ఇక్కడ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయబడదు. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయి” అనే హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పి.సి.ఎన్.డి.టి చట్ట నిబంధనలను ఉల్లంఘించి గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడిన వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. లింగ నిర్ధారణను ప్రోత్సహించే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వైద్యుల వైద్య రిజిస్ట్రేషన్ రద్దుకు సైతం చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే సంబంధిత స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఇన్‌చార్జి డెమో ఏనుగంటి రాజేశం, జూనియర్ అసిస్టెంట్ వి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>