భూగర్భంలో ఇరాన్‌ మరో ‘మిసైల్ సిటీ’!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇరాన్ (Iran) తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ భారీ భూగర్భ మిసైల్ సిటీకి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ఐఆర్‌జీసీ తన ఏరోస్పేస్ వీక్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని ‘మిసైల్ సిటీ’గా పరిచయం చేసింది. ఈ వీడియోల్లో సొరంగాల్లో వరుసగా నిల్వ ఉంచిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు కనిపించాయి. ఫత్తా, ఖొరమ్‌షహర్ వంటి క్షిపణులు కూడా ఇందులో ఉన్నట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే ఈ కేంద్రం ఎక్కడ ఉంది, అందులో ఎన్ని క్షిపణులు ఉన్నాయి, వాటి కార్యాచరణ సామర్థ్యం ఎంత అనే వివరాలు వెల్ల‌డించ‌లేదు. ఈ సందర్భంగా ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసవి మాట్లాడుతూ.. అమెరికా లేదా ఇతర శత్రువుల నుంచి మళ్లీ దాడులు జరిగితే మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లోని వారి సామర్థ్యాలపైనా దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఇరాన్ భూగర్భ కేంద్రాల్లో క్షిపణులు, డ్రోన్ల తయారీ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసినట్లు గతంలో ప్రకటించింది. వైమానిక దాడులు జరిగినా ఆయుధాల ఉత్పత్తి కొనసాగించగలమని ఇరాన్ సైనిక అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ సైనికంగా దాదాపు బలహీనపడిందని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించేందుకు సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అవసరమైతే అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఆర్థిక ఒత్తిళ్లు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>