పింఛన్ రూ.4 వేలు పెరిగే అవకాశం: కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: రాబోయే రోజుల్లో చేయూత పెన్షన్ల మొత్తాన్ని నెలకు రూ. 4వేలకు పెంచే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

నల్లగొండ పట్టణంలోని మామిళ్లగూడెం వద్ద ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మించి 480 ఇళ్లను పేదలకు అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. పెన్షన్లు రానివారు ఆందోళన చెందకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన తాను, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన వద్దకు రావాలని ప్రజలకు సూచించారు.

19 నుంచే బ్యాంకు ఖాతాల్లో జమ..

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్ల నగదు ఈ నెల 19 నుంచే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ ఫలాలను అందిస్తోందన్నారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో 2,430 దరఖాస్తులు రాగా 2,036 మంది అర్హత సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ హఫీజ్ ఖాన్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>