కలం, కడెం: గిరిజన గూడేల సమగ్రాభివృద్ధికి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి, గిరిజనుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు (ITDA PO Manda Makarandu) ఆదేశించారు. శుక్రవారం కడెం మండలం చిట్యాల, గోండుగూడ గిరిజన గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద జాబ్ కార్డుల జారీ, ఉపాధి పనుల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి జాబ్ కార్డు అందించాలని, వారికి నిరంతరాయంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకం నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక గిరిజన ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధన తీరు, పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. డిజిటల్ విద్యాబోధనకు వీలుగా వారం రోజుల్లోగా పాఠశాలలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డిజిటల్ విద్యా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ పీఓ స్పష్టం చేశారు.

