కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University)లో 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవ సభలో వక్తలు కీలకోపన్యాసాలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. సమాజాన్ని హేతుబద్ధంగా అర్థం చేసుకునేందుకు, సమ్మిళిత అభివృద్ధితో మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చారిత్రక అవగాహన పునాదిగా నిలుస్తుందన్నారు. చరిత్ర రచన గత సంఘటనల నమోదుకే పరిమితం కాకుండా, సామాజిక పరిణామాలను విశ్లేషిస్తూ సమానత్వం, ప్రగతికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
ప్రజల అనుభవాలకు స్థానం: ప్రొఫెసర్ విక్టర్బాబు
దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన లక్నోలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ విక్టర్బాబు మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ భారత మత, సాంస్కృతిక సంప్రదాయాలను ఏకరూపంగా చూడొద్దన్నారు. స్థానిక దేవతారాధనలు, గ్రామీణ విశ్వాసాలు, ఆదివాసీ సంప్రదాయాల మధ్య జరిగిన సమన్వయాన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యంలో విశ్లేషించాలన్నారు. వలసపాలన నాటి అధ్యయనాల్లోని పక్షపాతాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, సామాన్య ప్రజల జీవనానుభవాలకు చరిత్రలో స్థానం కల్పించాలని కోరారు.
ఏఐతో చరిత్ర పునర్నిర్మాణం: ప్రొఫెసర్ మస్తాన్వలి
బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్కే మస్తాన్వలి కీలకోపన్యాసం చేస్తూ.. వ్యవసాయ కూలీలు, రైతులు, చేతివృత్తిదారులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు నాగరికతకు అందించిన సేవలను వెలికితీయాలన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం, కులవివక్ష వ్యతిరేక ఉద్యమాలు, శ్రామికుల ప్రతిఘటనలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. శాసనాలు, పురావస్తు ఆధారాలు, మౌఖిక చరిత్రలతో పాటు కృత్రిమ మేధ, డిజిటల్ పరిశోధన సాధనాలను అణగారిన వర్గాల చరిత్ర పునర్నిర్మాణానికి వినియోగించాలని సూచించారు.
పురస్కారాల ప్రదానం.. ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్, కల్చర్ శాఖ సంచాలకుడు ప్రొఫెసర్ కె.అర్జునరావు, కాంగ్రెస్ కార్యదర్శి ప్రొఫెసర్ సదాశివన్ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో పరిశోధకులు పత్రాలు సమర్పించగా, డాక్టర్ కె.రాజన్, డాక్టర్ పరిమళ ఖడంగ, ప్రొఫెసర్ శ్రీనాథ్ స్మారకోపన్యాసాలు అందించారు. సాయంత్రం నూతన యాంపీ థియేటర్లో విద్యార్థుల శాస్త్రీయ నృత్యాలు, తెలంగాణ జానపద ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ అరుణప్రియ, మహాసభల స్థానిక కార్యదర్శి డాక్టర్ పనస రామకృష్ణ, ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ ఆకుల రవి, డాక్టర్ షరీఫ్, డాక్టర్ శ్రీనివాస్, వివేక్ పాల్గొన్నారు.

