కలం, ఖమ్మం బ్యూరో: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పెద్ద మనసు చాటుకున్నారు. బాధిత చిన్నారులకు ‘చేయూత’ పథకం కింద పింఛన్లు మంజూరు చేయించడంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు తలసేమియా బాధిత చిన్నారులు (Thalassemia Children), వారి తల్లిదండ్రులు మంత్రి పొంగులేటిని కలిసి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గతంలో ఖమ్మం ఎంపీగా ఉన్న సమయంలోనే తలసేమియా బాధితుల సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రస్తావించి జాతీయ స్థాయిలో దృష్టికి తీసుకెళ్లిన పొంగులేటి, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కూడా వారి సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని బాధితులు కొనియాడారు. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ‘సంకల్ప’ స్వచ్ఛంద సేవా సంస్థ పరిధిలోని సుమారు 150 మంది చిన్నారులతో పాటు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది మంది బాధితులకు చేయూత పింఛన్లు మంజూరు కానున్నాయి.
నిరంతర రక్తమార్పిడి, ఖరీదైన వైద్య ఖర్చులతో సతమతమవుతున్న తమకు ఈ పింఛన్లు ఎంతో ఊరటనిస్తాయని తల్లిదండ్రులు భావోద్వేగంతో తెలిపారు. ఆపదలో ఉన్న తమ కష్టాలను గుర్తించి, ఆర్థికంగా అండగా నిలిచిన పొంగులేటికి చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో పాటు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పొద్దుటూరి పావని, సభ్యులు అనిత, ఉదయ భాస్కర్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

