కలం, స్పోర్ట్స్: మ్యాచ్ పాయింట్.. ఓటమి అంచున నిలిచిన పరిస్థితి.. కానీ జెస్సికా పెగులా (Jessica Pegula) మాత్రం వెనక్కి తగ్గలేదు. అసాధారణ పోరాటంతో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లిండా నోస్కోవాపై సంచలన విజయం సాధించి డబ్ల్యూటీఏ ఫైనల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు కోకో గాఫ్‌కు మాత్రం ఊహించని షాక్ తగిలింది. గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గురువారం జరిగిన కీలక పోరులో పెగులా 7-6(2), 4-6, 7-5తో నోస్కోవాను ఓడించింది. దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
ఒక దశలో మ్యాచ్ పాయింట్ ఎదుర్కొన్న పెగులా.. అద్భుతంగా పుంజుకుంది. కీలక సమయంలో ఏస్‌లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఏకంగా 16 ఏస్‌లు కొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ రికార్డు నమోదు చేసింది. ఈ విజయంతో గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన పెగులా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. నోస్కోవా కూడా గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు చేరింది. ఇద్దరూ రెండేసి విజయాలు సాధించినప్పటికీ సెట్‌ల ఆధారంగా స్థానాలు నిర్ణయమయ్యాయి.
అంతకుముందు కోకో గాఫ్ కూడా మార్టా కోస్ట్యుక్‌పై 6-4, 7-5తో విజయం సాధించింది. రెండో సెట్‌లో 1-5తో వెనుకబడినా.. వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి అద్భుతంగా పుంజుకుంది. అయినా పెగులా గెలుపుతో గాఫ్ సెమీస్ అవకాశాలు ముగిశాయి. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక సెమీఫైనల్లో పెగులాకు రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా ఎదురుకానుంది. గతంలో ఆండ్రీవాపై పెగులా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మ్యాచ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. వీరిద్దరూ తొలిసారి కోర్టులో తలపడనున్నారు.

