కలం, వలిగొండ: ఆరుగాలం కష్టించి పండించిన రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్ (Pasham Bhaskar) డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో చిట్యాల-భువనగిరి ప్రధాన రహదారిపై పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పాశం భాస్కర్ హాజరై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సొంత మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు.
తక్కువ ధరలకు అమ్ముకుంటూ..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొబ్బరికాయలు కొట్టి, రిబ్బన్లు కట్ చేయడం మాత్రమే చేశారని పాశం భాస్కర్ విమర్శించారు. దీంతో రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు, మధ్య దళారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని వివరించారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కందుల తానీషా గౌడ్ పాల్గొన్నారు.

