కలం, కడెం : పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) అన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో 105 మంది లబ్ధిదారులకు (105 Beneficiaries) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను (Kalyana Lakshmi Cheques) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఆరు నెలల ముందే రైతులను ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. అయితే రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో చర్చించి నీటిని విడుదల చేయించినట్లు వెల్లడించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

