కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా క్రికెట్లో కెప్టెన్సీ ఎంపికపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. తన చర్మరంగు కారణంగానే 2018లో ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీ దక్కలేదని ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) ఆరోపించాడు. తన పుస్తకం ‘సబ్ర్’లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఖవాజా వ్యాఖ్యలను ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ వివాదం బయటపడటంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో తాత్కాలిక కెప్టెన్సీ తనకు దక్కుతుందని ఖవాజా భావించాడు.
కానీ, ఆ బాధ్యతలు టిమ్ పైన్‌కు అప్పగించారు. ఆ తర్వాత 2021లో పైన్ స్థానంలో కమిన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే తనకు కెప్టెన్సీ దక్కకపోవడానికి గతంలో జీతాల విషయంలో తాను చేసిన పోరాటం, తన చర్మరంగు కూడా కారణమని ఖవాజా అభిప్రాయపడ్డాడు. చిన్నప్పటి నుంచి ఆస్ట్రేలియాలో జాతి వివక్షను ఎదుర్కొన్నానని తన పుస్తకంలో వివరించాడు. ఈ ఆరోపణలపై స్పందించిన కమిన్స్.. ఖవాజా పుస్తకంలోని చాలా అంశాలతో ఏకీభవిస్తున్నప్పటికీ, కెప్టెన్సీ విషయంలో జాతి వివక్ష ఉందన్న వాదనను మాత్రం నమ్మడం లేదని స్పష్టం చేశాడు.
ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే అందుకు ఆధారాలు చూపించాలని అన్నాడు. చర్మరంగుతో సంబంధం లేకుండా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొన్నాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో జాతి వివక్షకు సంబంధించిన ఘటనలు గుర్తుకు రావడం లేదని కమిన్స్ తెలిపాడు. ఖవాజా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అనుభవమని, వాటిపై తాను మరింతగా మాట్లాడదలుచుకోలేదని చెప్పాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్లో కెప్టెన్సీ ఎంపికపై పాత వివాదం మరోసారి చర్చకు వచ్చింది.

