కలం, దేవరకొండ: దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కోసం ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) శుక్రవారం స్థల పరిశీలన నిర్వహించారు. 18వ వార్డు పరిధితో పాటు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలను దేవరకొండ ఆర్డీవో, తహసీల్దార్, సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. భవన నిర్మాణానికి అనువైన విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, ప్రజలు సులువుగా రాకపోకలు సాగించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
సత్వర పరిపాలన అందించడమే..
ఈ సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వస్తే, అన్ని శాఖల సేవలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శకమైన, సత్వర పరిపాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు, ఇతర సాంకేతిక ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, నాయకులు పున్న వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహ, హనుమంతు వెంకటేష్ గౌడ్, వడ్త్యా దేవేందర్ నాయక్, లోకసాని శ్రీధర్ రెడ్డి, వైఎస్. కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

