కలం, కడెం: రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) సూచించారు. కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, పీఏసీఎస్ చైర్మన్ రమేష్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

