డయల్ 112తో మహిళకు భరోసా.. క్షేమంగా కుటుంబానికి అప్పగింత

కలం, ఖమ్మం బ్యూరో: ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అభయహస్తంగా నిలుస్తుందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు (Khammam Police) మరోసారి చాటిచెప్పారు. అత్యవసర నంబర్ డయల్‌-112కు (Dial 112 Emergency Call) అందిన ఒక్క కాల్‌తో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, తప్పిపోయిన ఓ మహిళను (Missing Woman) వేగంగా గుర్తించి క్షేమంగా ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ​వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తప్పిపోయినట్లు గత రాత్రి డయల్‌-112కు అత్యవసర ఫిర్యాదు అందింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం టూ టౌన్ పోలీస్ సిబ్బంది, బ్లూకోల్ట్స్ (Blue Colts) బృందం అప్రమత్తమై నగరంలోని పలు కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఖమ్మం న్యూ బస్‌స్టాండ్ పరిసరాల్లో సదరు మహిళను పోలీసులు గుర్తించారు. ఆమెకు ధైర్యం చెప్పి భరోసా కల్పించిన పోలీసులు, అనంతరం కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి క్షేమంగా వారికి అప్పగించారు.

ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు, ఆపదలు ఎదురైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్‌-112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సకాలంలో స్పందించి మహిళను క్షేమంగా కాపాడిన టూ టౌన్ సిబ్బందిని, బ్లూకోల్ట్స్ బృందాన్ని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. తమ వారిని సురక్షితంగా అప్పగించినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>