కలం, సోన్: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించడంతో పాటు, లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సోన్ మండలం సంగంపేట్ (Sangampet) గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లకు అవసరమైన అన్ని సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని సూచించారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని, తద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ విబిజి రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పనులు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్ డీఈ గంగాధర్, సర్పంచ్ విలాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

