కలం, జడ్చర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) అన్నారు. గురువారం జడ్చర్ల మండలం వల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Vallur ZPHS) పారిశుధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను సమీక్షించారు. పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తరగతి గదులు, పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత కార్యదర్శిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని, పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు.

