వద్దంటున్నా వరి వైపే రైతుల చూపు!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రబీలో వరి సాగు (Paddy Cultivation) చేయొద్దని చెబుతుండగా, మరోవైపు రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూర, ఎడపల్లి, నందిపేట్, సిరికొండ, వర్ని, కోటగిరి, మోస్ర, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్ మండలాల పరిధిలో సాగు పనులు మొదలు అయ్యాయి. రైతులు నార్లు సిద్ధం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో నాట్లు కూడా వేస్తున్నారు. బాన్సువాడ మండలం పోచారం, రాంపూర్ తండా రైతులు స్వల్పకాలిక వరి వంగడాలతో నారు వేస్తున్నా రు.

ఖరీఫ్ లో ఆలస్యంగా వరి సాగు చేసిన పంటలకు విడుదల చేసే నిజాంసాగర్ నీటితోనే తాము నాట్లు వేసుకుంటామ ని, ఆ తర్వాత బోరుబావుల ద్వారా పంటకు నీరందిస్తామని రైతులు చెబుతున్నారు. బోరుబావుల కింద ఉన్న భూమి లో మొత్తంగా కాకుండా 50 శాతం మాత్రమే వరి సాగు చేస్తామని పేర్కొంటున్నారు. ఖరీఫ్ లో వడ్ల ధర ప్రభుత్వ మద్దతు ధరకు మించి క్వింటాలుకు రూ.700 నుంచి రూ.1000 అదనంగా పలికింది. దీంతో యాసంగిలోనూ రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.

తాగునీటికే నిల్వలున్నా కానీ..

నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా సాగు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు కిందనే ఉంటుంది. గత ఖరీఫ్ లో సరిగా వర్షాలు కురవకపోవడంతో రైతులు వరికి బదులు ఇతర పంటలవైపు వెళ్లాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అయినా కానీ.. ఆలస్యంగా కురిసిన వానలతో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగు జిల్లాలోనే అయింది. అంతే రికార్డు స్థాయిలో వ్యాపారులు ధాన్యాన్ని కల్లాల నుంచే తీసుకెళ్లారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర రూ.2,400కు మించి వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని సైతం రూ.3,600 నుంచి రూ.3,800 వరకు కొనుగోలు చేశారు.

దీనికి కారణం.. ఎల్ నినో పరిస్థితులతో ఇతర జిల్లాల్లో సరిగా వరి సాగు చేయకపోవడంతో ఈసారి నిజామాబాద్ జిల్లాలో పండిన ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. రికార్డుస్థాయిలో వ్యాపారులు ధర చెల్లించారు. తద్వారా యాసంగిలోనూ రైతులు కష్టమైనా సరే వరివైపే మొగ్గు చూపుతుండగా, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్లో 9 టీఎంసీలు, శ్రీరాంసాగర్ లో 36 టీఎంసీలు ఉండగా.. ఇది కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే యాసంగికి సాగు నీరు అందడం కష్టమని కూడా స్పష్టం చేస్తున్నారు.

ప్రచారంలో అధికారుల వెనుకంజ

రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని సూచించినా.. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఒక్కో మండలంలో రెండు, మూడు గ్రామాల్లోనే ఇప్పటివరకూ వ్యవసాయ శాఖ సదస్సులు నిర్వహించింది. అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల వరి సాగు చేసేందుకు నార్లు సిద్ధం చేస్తుండటంతో పాటు నాట్లు కూడా వేస్తున్నారు. యాసంగి సాగు మొదల య్యేలోపే రైతులకు ప్రస్తుతం ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు, భూగర్భజలాల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పంటలు సాగుచేస్తే లాభాలతో పాటు తక్కువ నీరు అవసరమవుతుందో రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తే తప్ప ఇతర పంటల వైపు మళ్లే అవకాశాలు లేవు.

ప్రణాళిక సరే.. వద్దన్నా వరి

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ శాఖ యాసంగి సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది జిల్లాలో 4,35, 740 ఎకరాల్లో వరి వేశారు. ఈసారి 2 లక్షల 21 వేల ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ.. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు తాగునీటికే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. వరి సాగు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా.. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల రైతులు వరి (Paddy Cultivation) వేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఆ దిశగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. దీంతో రైతులు యాసంగి పంటపై పునరాలోచనలో పడుతున్నారు. గతేడాది 5 లక్షల 30వేల ఎకరాలకుపైగా పంటలు సాగుకాగా, ఈసారి 3 లక్షల ఎకరాలలోనే పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో ఆడుగంటే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో అత్యధికంగా పంటల సాగు ప్రాజెక్టుల ఆయకట్టు కాగా.. ఆ తర్వాత బోరుబావుల కిందే ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎండిపోయాయి. కొత్తగా బోర్లు వేసేందుకు రైతులు రూ. లక్షల్లో ఖర్చు చేసే పరిస్థితి కూడా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>