కలం, ఖమ్మం: జిల్లాలో విదేశీ పౌరులకు వసతి కల్పించే యజమానులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP Sunil Dutt) హెచ్చరించారు. ఈ మేరకు అయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ మార్గదర్శకాలు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 సెక్షన్ 8 ప్రకారం.. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌స్టేలు, పీజీ కేంద్రాలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మతపరమైన వసతి కేంద్రాలతో పాటు తమ ఇళ్లలో విదేశీయులకు బస కల్పించే వ్యక్తులు, సంస్థలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఓసీఐ కార్డుదారులు, నేపాల్, భూటాన్ పౌరులతో సహా విదేశీయులు ఎవరైనా బస చేస్తే, వారు వచ్చిన 24 గంటల్లోపు వారి రాక, బయలుదేరిన వివరాలను ఫారం-III (Form-C) ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి. సంబంధిత రికార్డులను యాజమాన్యాలు కనీసం ఒక సంవత్సరం పాటు భద్రపరచాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 సెక్షన్ 23 ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో పాటు భారీ జరిమానాలు ఉంటాయని సీపీ తెలిపారు.
వివరాలు సమర్పించని వాణిజ్య, వ్యక్తిగత వసతి కల్పించేవారికి రూ.50,000 నుంచి, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు రూ.1,00,000 వరకూ జరిమానా విధిస్తారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తే గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.5 లక్షల వరకు జరిమానా, నకిలీ పత్రాల వినియోగానికి 2 నుండి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. వీసా గడువు ముగిశాక దేశంలో కొనసాగితే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా పడుతుంది.
విదేశీయులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, వీసాతోనే నివసించాలని, వసతి కల్పించేవారి ద్వారా ఫారం-III ఆన్‌లైన్‌లో నమోదైందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. చిరునామా మార్పులు, పాస్‌పోర్టు లేదా వీసా పోగొట్టుకుంటే వెంటనే అధికారులకు తెలపాలని, వీసా గడువు ముగిశాక దేశంలో ఉండకూడదని, అనుమతి లేని ఉద్యోగాలు లేదా నిషేధిత కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. విదేశీ పౌరుల వివరాల నమోదు చట్టబద్ధమైన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు సహకరించాలని కోరారు. ఆన్‌లైన్ నమోదు కోసం అధికారిక వెబ్‌సైట్లను (indianfrro.gov.in) ఉపయోగించుకోవాలని తెలిపారు.

