షూటింగ్‌లో భారత్ మార్క్: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్ సొంతం

కలం, స్పోర్ట్స్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ నీరజ్ కుమార్ (Neeraj Kumar) అద్భుత ప్రదర్శనతో మెరిశారు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ ఈవెంట్‌లో ఆయన కాంస్య పతకం సాధించారు. ఈ విజయంతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున అర్హత కోటాను ఆయన ఖరారు చేశారు. గత వారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా వెండి పతకంతో మొదటి ఒలింపిక్ కోటాను సాధించగా, నీరజ్ గెలుపుతో షూటింగ్‌లో భారత్‌కు ఇది రెండో కోటాగా నిలిచింది. ఫైనల్ పోరులో నీరజ్ కుమార్ మొత్తం 346.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. స్లోవేకియాకు చెందిన పాట్రిక్ జానీ 357.2 పాయింట్లతో వెండి పతకం గెలుచుకున్నారు.

డిమిట్రీ పిమెనోవ్‌కు స్వర్ణం..

ఈ పోటీలో డిమిట్రీ పిమెనోవ్ 362.8 పాయింట్లతో జూనియర్ ప్రపంచ రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. మరో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు. ఫైనల్లో నిబంధనల ప్రకారం, అప్పటికే కోటా పొందిన క్రీడాకారులు ఉన్నందున, తదుపరి అర్హత కలిగిన నీరజ్ కుమార్‌కు ఒలింపిక్ బెర్త్ దక్కింది. ప్యారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం సాధించిన విభాగంలోనే నీరజ్ ఈ కోటాను సాధించడం విశేషం. ప్రస్తుతం దోహాలో జరుగుతున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిగిలిన విభాగాల్లోనూ భారత షూటర్లు రాణించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>