ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం: భట్టి విక్రమార్క

కలం, వరంగల్ బ్యూరో: విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్యావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం కాజీపేట (Kazipet) ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విద్యా సంస్కరణలను వివరించారు.

105 యంగ్ ఇండియా పాఠశాలలు

రాష్ట్రంలో విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశామని భట్టి (Bhatti Vikramarka) తెలిపారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించనున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల విద్యార్థులందరూ ఒకే ప్రాంగణంలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య, ఆధునిక సదుపాయాలు, వసతి కల్పించడంతో పాటు విద్యార్థుల్లో సామాజిక సమైక్యత, సమానత్వ భావన పెంపొందించడమే ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశమని అన్నారు.

ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఆధునిక తరగతి గదులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు, రవాణా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు, బూట్లు, టైలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగులను ఉచితంగా అందిస్తామని వివరించారు.

27 లక్షల మందికి అల్పాహార పథకం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పారు. వారానికి ఆరు రోజులు పౌష్టికాహారం, ప్రత్యామ్నాయ రోజుల్లో పాలు, రాగిజావ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ప్రభుత్వ రవాణా ద్వారా విద్యార్థులను ఇళ్లకు చేర్చుతామని వివరించారు. పిల్లలు పగటిపూట అత్యుత్తమ విద్యా సదుపాయాలు పొందడంతో పాటు రాత్రివేళ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెంచాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి సర్వేలో విద్యే సమాజ అభివృద్ధికి ప్రధాన సాధనమని స్పష్టమైందని భట్టి అన్నారు. అందుకే విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ విద్యా సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, నాయకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, టీజీఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Also Read : నిర్మల్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన.. వీఐపీ పాసులున్నా నో ఎంట్రీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>