కలం, వెబ్ డెస్క్: నేటి సమాజంలో పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా రోజురోజుకు ఆకతాయిల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మందుబాబులు ఓ విద్యార్థిపై దాడి (Student Attack) చేసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కృష్ణా జిల్లా గన్నవరం (Gannavaram) మండలంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మందుబాబులు విద్యార్థిపై దాడి చేశారు. కట్టుబడి పాలెం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కూచిపూడి కార్తీక్ తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అతడిని అడ్డుకుని రూ.200 ఇవ్వాలంటూ వేధించారు. అయితే ఆ విద్యార్థి డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన మందుబాబులు బాబుపై విచక్షణారహితంగా బ్లేడుతో దాడి చేసి గాయపరిచారు.
దాడి అనంతరం విద్యార్థి జేబులో ఉన్న రూ.200 నిందితులు బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించారు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో ఆ డబ్బులు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కేసరపల్లి వీఎన్ పురం, గొల్లనపల్లికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

