కరువు ప్యాకేజీ ప్రకటించాలి.. సిపిఐ డిమాండ్

కలం, హనుమకొండ: తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.20 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం (Drought Package) ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని విడనాడి, కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కోరారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కరువు సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు చౌకధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా లేదా రాయితీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

నీరు లేక ఎండిపోయిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తక్షణ పరిహారం అందించాలని కోరారు. వరికి ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, కౌలు రైతులను కూడా గుర్తించి ప్రభుత్వ సాయం అందించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులను పరిశీలించకుండా కేవలం గణాంకాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించడం సరికాదని విమర్శించారు.

పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>