కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ హిమాలయాల్లో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ (Kedarnath Temple) తలుపులు శీతాకాలాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం వేదమంత్రాల ఉచ్ఛారణల మధ్య మూతపడ్డాయి. ఆర్మీ బ్యాండ్ భక్తి సంకీర్తనలు, భక్తుల హర హర మహాదేవ్ స్మరణల నడుమ కేదార్నాథ్ ధామ్ ద్వారాలను ప్రధాన పూజారులు మూసివేశారు.
శీతాకాలంలో ఈ ప్రాంతం తీవ్రమైన మంచు తుఫానులు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఘనీభవిస్తుంది. ఈ కారణంగా ఈ రోజు నుండి శీతాకాలం ముగిసే వరకు (వచ్చే ఏడాది మే నెల వరకు) కేదార్‌నాథ్‌లో స్వామివారి ప్రత్యక్ష దర్శనాలు పూర్తిగా నిలిచిపోతాయి.
ఈ ఆరు నెలల కాలంలో భక్తుల పూజల కోసం కేదార్నాథ్ ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖీమఠ్‌కు తరలిస్తారు. శీతాకాలం అంతా ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలోనే స్వామివారికి నిత్య పూజలు, దర్శనాలు కొనసాగుతాయి.

