కలం, ఖమ్మం బ్యూరో: సమాజంలో ఇంకా వేళ్లూనుకుని ఉన్న మూఢనమ్మకాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన (Khammam Crime) ఉమ్మడి జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా హత్య చేసిన అనంతరం మృతదేహాలను భూమిలో పాతిపెట్టిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లపల్లి మండలం బుస్సాయిగూడెం గ్రామానికి చెందిన మడకం భీమయ్య, మణుగూరు మండలం బూడుగుల గుత్తిగోయ గుంపునకు చెందిన పదం మాసయ్య అక్టోబర్ 7న ఒక ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. పూజా కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి తిరిగి భూసురాయిగూడెం వైపు వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు.
భీమయ్య, మాసయ్యలే తమపై మంత్రాలు ప్రయోగిస్తూ పీడిస్తున్నారనే తీవ్రమైన మూఢనమ్మకంతో నిందితులు వారిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత విషయం బయటకు రాకుండా మృతదేహాలను సమీపంలో భూమిలో రహస్యంగా పూడ్చిపెట్టారు. కాగా, మృతుడు భీమయ్య కుమార్తె ఎట్టి నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూఢనమ్మకాల పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి ఘటనలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

