మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు: కలెక్టర్

కలం, నల్లగొండ: రైతులు పండించిన పంట ఉత్పత్తులను సురక్షితంగా విక్రయించుకోవడం కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్‌లు, గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Nalgonda Collector Chandrashekar) వెల్లడించారు. మంగళవారం అనుముల మండలం శ్రీనాథపురం గ్రామంలోని పంట పొలాల వద్ద రైతులతో ఆయన నేరుగా ముఖాముఖి మాట్లాడారు. రైతులందరూ ముందుకు వస్తే ‘వీబీజీ రామ్ జీ’ పథకం కింద ఈ గోదాముల నిర్మాణాలు చేపడతామని, మహిళా సంఘాలకు స్థలం లభ్యతను బట్టి వారం రోజుల్లోనే శంకుస్థాపన చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ నూతన సదుపాయం అందుబాటులోకి వస్తే దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ అనుకూల సమయాల్లో అమ్ముకునే వీలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిపై రైతులలో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ఆచితూచి సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన చిక్కుడు, మినుములు, కందులు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 100 రోజుల్లో చేతికి వచ్చే పంటలకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ముందే అంచనా వేసుకోవాలని, శ్రీరామనవమి వరకు వాతావరణ పరిస్థితులను గమనించి తదుపరి సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నప్పటికీ, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం ఎంతో కీలకమన్నారు.

రైతు కుటుంబాల్లోని డిగ్రీలు చదివిన యువత ఆధునిక ఆలోచనలు, నూతన సాగు పద్ధతులతో వ్యవసాయ రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ మల్‌రెడ్డి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>