కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయం (Kurumurthi temple) బ్రహ్మోత్సవాల వేళ భక్తులతో పోటెత్తుతోంది. ఏడు కొండల వాసుడైన వేంకటేశ్వరుడు కలియుగంలో భక్తులను అనుగ్రహించేందుకు వెలసిన దివ్యక్షేత్రాలలో కురుమూర్తి ఒకటి. దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని ఏడు కొండల మధ్య కురుమూర్తి స్వామి కొలువై ఉన్నారు.
తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారు ఏడు కొండల మధ్య స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. అందుకే దీనిని “పేదల తిరుపతి” అని కూడా పిలుస్తారు. ఆర్థిక స్తోమత లేక తిరుమల వెళ్లలేని భక్తులు.. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు దాదాపు 16 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారికి అలంకార సేవలు, వాహన సేవలు కన్నుల పండుగగా సాగుతాయి. హంస వాహనం, శేష వాహనం, గరుడ వాహన సేవలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల సమయంలో “గోవిందా.. గోవిందా..” అనే నామస్మరణతో కురుమూర్తి కొండలు మార్మోగుతాయి. తెలంగాణ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
ఉద్దాల ఉత్సవం
కురుమూర్తి జాతరలో అత్యంత ప్రధానమైనది, ఆకర్షణీయమైనది “ఉద్దాల ఉత్సవం”. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన దళితులు తరతరాలుగా స్వామివారికి తోలుతో పాదుకలు (చెప్పులు) తయారు చేస్తారు. వీటిని “ఉద్దాలు” అంటారు. స్వామివారి పాదుకలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా కొండపైకి తీసుకువెళ్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో పోటీపడతారు. ఈ పాదుకలను తాకితే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉద్దాల ఉత్సవం ఈ నెల 16వ తేదీన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
దాసరి వారి సేవ
స్వామివారికి కైంకర్యాలు నిర్వహించడంలో దాసరి వంశస్థులది ప్రత్యేక పాత్ర. స్వామివారికి వీపుపై తట్టలు కట్టుకుని వీరు చేసే సేవలు, విన్యాసాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రకృతి రమణీయత నడుమ, భక్తి భావం ఉప్పొంగేలా జరిగే కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మన సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక.
ఈ నెల 10వ తేదీ నుండి 25 వరకు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈనెల 10న స్వామివారి కల్యాణోత్సవం, 14న అలంకారోత్సవం, 16న ఉత్సవాలలోని ప్రధాన ఘట్టమైన ఉద్ధాల ఉత్సవం నిర్వహించబడుతుంది. 25వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో స్పెషల్ బస్సులను అధికారలు నడపనున్నారు.

