కలం, వెబ్ డెస్క్: గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీలుగా ఎంపికైనవారిలో 35 శాతం మంది శిక్షణలో ఫెయిల్ అవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలకు ఇది మరింత బలం చేకూర్చేలా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం గ్రూప్–1 పరీక్షను ఎలా నిర్వహించారనే అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ హరితకు వినతిపత్రం అందించారు. పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణలో 35 శాతం మంది డీఎస్పీలు ఫెయిల్ అవ్వడమనేది అసాధారణ విషయమన్నారు.
సులభమైన పరీక్షల్లో ఎలా..?
డీఎస్పీలు, ఆర్డీవోలు, సీటీవోలుగా శిక్షణ పొందుతున్నవారికి సాధారణంగా అకాడమీలో పెట్టే పరీక్షలు చాలా సులభంగానే ఉంటాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వివరించారు. ఎంతో కష్టమైన ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాసి వచ్చినవారు ఇంతటి సులభమైన పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యారని ప్రశ్నించారు. అందుకే ఈ పరీక్ష నిర్వహణ సరిగ్గానే జరిగిందా..? లేదా..? అనేది తమకు అనుమానం కలుగుతోందన్నారు. డీఎస్పీలు శిక్షణలో ఫెయిల్ అవ్వడంపైనా సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ.. కంటతడి పెట్టుకుంటున్న అభ్యర్థుల మాటకు విలువనిచ్చి వెంటనే విచారణ జరిపించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎంపై ఉందని స్పష్టం చేశారు.

