కలం, మిర్యాలగూడ: ధాన్యం పండించిన రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) స్పష్టం చేశారు. మిర్యాలగూడ (Miryalaguda) నియోజకవర్గంలో ధాన్యం ధరలు (Paddy Price) తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వ్యక్తం చేసిన ఆందోళనపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడూతూ.. నియోజకవర్గంలోని ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. 3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైస్ మిల్లులో ధాన్యం క్వింటాల్‌కు రూ. 3,500 తగ్గకుండా కొనుగోలు చేస్తామని వారు ప్రకటించారు.
అంతేకాకుండా నాణ్యత బాగున్న ధాన్యానికి రూ. 3,500 కంటే ఎక్కువ ధర చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకంటే తగ్గించి కొనుగోలు చేయబోమని రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ సమస్యను వెంటనే గుర్తించి రైస్ మిల్లర్లతో చర్చించి మద్దతు ధర దక్కేలా చొరవ చూపిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి నియోజకవర్గ రైతాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

