ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే ఇవ్వాలని వినతి

కలం, బోనకల్: 30 ఏళ్లుగా సొంత ఇల్లు లేకుండా జీవిస్తున్నా.. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమకు చోటు దక్కడం లేదని ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం (Choppakatlapalem) గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోనకల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా, తమ గ్రామంలో మాత్ర ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, నిజమైన నిరుపేదల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇళ్లు ఉండి, ఆర్థిక స్థోమత కలిగిన వారికి మళ్లీ కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

క్షేత్రస్థాయిలో విచారణ చేపడితేనే..

చొప్పకట్లపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని తహసీల్దార్ చల్లూరి సుధాకర్‌ను కోరారు. గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ సర్వే నిర్వహించాలన్నారు. బాధితులు అందజేసిన వినతిపత్రాన్ని స్వీకరించిన తహసీల్దార్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహించి, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

బాధితులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బోయినపల్లి ధనమ్మ, తెల్లబోయిన దీపిక, వడ్డేబోయిన శైలజ, రచ్చ నారాయణమ్మ, రచ్చ స్వప్న, మోర్ల కావ్య, గడపాకుల కస్తూరి, గడపాకుల లక్ష్మి, చామర్తి ఉష, చామర్తి మల్లేశ్వరి, బోయినపల్లి కాలిక, అమర్లపూడి రవి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>