కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ కేంద్రం బుద్ధవనంలో సోమవారం దమ్మ దీపోత్సవం (Dhamma Deepotsavam) వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని అశోక చక్రం నుంచి దమ్మ జ్యోతులతో బౌద్ధాభిమానులు, స్థానికులు దమ్మ జ్యోతి ర్యాలీ నిర్వహించారు. అశోక ధర్మచక్రం నుంచి ప్రారంభమైన దమ్మ జ్యోతి ర్యాలీ మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో ఉన్న బుద్ధుని విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం మహాస్తూపం చుట్టూ పరిక్రమ నిర్వహించి, ధ్యాన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇఫ్లూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంతోష్ రవత్ మాట్లాడుతూ.. జ్ఞానోదయం సిద్ధించిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి కపిలవస్తు నగరానికి విచ్చేసినప్పుడు ప్రజలు దీపాలతో స్వాగతం పలికారని అన్నారు. బుద్ధుడు, బౌద్ధ భిక్షువులు వస్సా వాసం పూర్తి చేసుకుని జనవాసాల్లోకి వచ్చే సందర్భంలో ప్రజలు దీపాలతో స్వాగతం పలికిన నేపథ్యంలో దీపోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ బుద్ధవనం ద్వారా, తద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచం మొత్తానికి శాంతి, అహింస భావాలను చాటిచెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షులు పరంధాములు, నాగ్‌పూర్ ప్రొఫెసర్ చేతన్ రవత్, ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ల అధ్యక్షులు వాల్మీకి హరికృష్ణ, నాగ్‌పూర్‌కు చెందిన డి.వి. కిలాడ్రి, గౌతమ్ జగదొండే, సమాధాన్ దొండేలతో పాటు వివిధ బౌద్ధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అలాగే బుద్ధవనం ఓఎస్డీ సుధాన్ రెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శాసన బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ ఇన్చార్జి మేనేజర్ శ్యాంసుందర్ రావు, ఏఈ నజీష్, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర రెడ్డి, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

