కలం, మునుగోడు : పట్టణ ప్రజలకు మరింత మెరుగైన ప్రజోపయోగ సేవలు అందించాలనే లక్ష్యంతో చండూరు (Chandur) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గపురి వాహనాన్ని(Swargapuri Vahanam) సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కుటుంబంలో ఎవరైనా మరణించిన సమయంలో అంత్యక్రియల నిర్వహణకు వాహనం లేక ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్గపురి వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పది వార్డుల ప్రజలందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం, ప్రజలకు అవసరమైన సేవలను అందించడం స్థానిక సంస్థల బాధ్యతని అన్నారు. మానవతా దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
స్వర్గపురి వాహన ఏర్పాటుకు సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు దాతలు, పట్టణ ప్రముఖులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచేలా స్వర్గపురి వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కుటుంబంలో మరణం సంభవించినప్పుడు అంత్యక్రియల నిర్వహణకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, కల్లెట్ల చంద్రకళ మారయ్య, పట్టణ అధ్యక్షుడు ఐతరాజు మల్లేష్, పట్టణ ప్రముఖులు గుర్రం బిక్షమయ్య, పున్న ధర్మేందర్, పన్నాల లింగయ్య, గండూరి నగేష్, రామస్వామి వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభరద్వాజ్, వార్డు అధికారులు బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

