కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బియ్యం కొరత (Rice Shortage) ఉందని నో స్టాక్ బోర్డులు పెడుతున్నట్లు వార్తలు వస్తుండటంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. మార్కెట్లో జరుగుతున్న మోసాలపై అప్రమత్తమైన సివిల్ సప్లైస్ శాఖ.. బియ్యం కొరత సృష్టిస్తున్న దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బియ్యం కొరత ఏమాత్రం లేదని.. రిటైల్ వ్యాపారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. నేరుగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే నేరుగా రైస్ మిల్లుల నుంచే బియ్యాన్ని సరఫరా చేస్తామని వివరించారు.
ఎమ్మార్పీ దాటి అమ్మితే..
ఎల్ నినో (El Nino) కారణంగా వరి దిగుబడులు తక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో దళారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే సివిల్ సప్లై శాఖ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో 25 కిలోల బస్తాలపై 26 కిలోల స్టిక్కర్లు వేసి విక్రయిస్తూ.. మోసం చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసింది. ఎమ్మార్పీ రేటు దాటి.. ఒక్క రూపాయి అధికంగా అమ్మినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. అదే సమయంలో ప్రజలు ఎక్కువగా వాడే బియ్యం రకాల ధరలను కూడా ఫిక్స్ చేసింది. తెలంగాణ సోనా కిలో రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలను కిలో రూ.79కి మించి విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : కోహ్లీని చూసి కోచ్‌లే భయపడేవాళ్లు: టెన్ డోషాట్
Follow Us On: X(Twitter)

