కలం, మహబూబ్ నగర్ బ్యూరో : నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి తెలియజెప్పాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్‌కు (Sanjeev Mudiraj) ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు (NHM Employees) సోమవారం వినతి పత్రం అందజేశారు. ఎన్‌హెచ్‌ఎం వైద్యులు, ఉద్యోగుల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి ప్రభుత్వానికి తెలియచెప్పాలన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందించాలని కోరారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను, డిమాండ్లను సావధానంగా విన్న డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

