కలం, కరీంనగర్ బ్యూరో: సీపీఎం కరీంనగర్ (CPM Karimnagar) నగర కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 50 ఉద్యోగాలకు 1,785 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని, దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు ఉద్యోగాలు ఇస్తామని సుమారుగా ఒక్కో నిరుద్యోగి నుండి 6 నుండి 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇందులో అవినీతి అధికారుల ప్రమేయం లేకుండా, రాజకీయ ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అర్హులైన వారికి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తామని మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న దళారులను, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి, ప్రెస్ మీట్ పెట్టి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, ఆసంపల్లి వినయ్ పాల్గొన్నారు.

