కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గన్నవరం(Gannavaram)లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాసా టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఎస్ఆర్ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు బాణసంచా కాల్చుతున్న సమయంలో ఎగిరిపడిన నిప్పురవ్వలు ప్రమాదవశాత్తు ఈ ఫర్నిచర్ దుకాణంలో పడ్డాయి. దుకాణంలో నిల్వ ఉంచిన ఫోమ్ సీట్లు, పరుపులు, ఇతర వస్తువులు ఉండటంతో, ఆ నిప్పురవ్వలు వేగంగా వ్యాపించి క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
మంటలు వేగంగా విస్తరించడంతో ఎస్ఆర్ ఫర్నిచర్ షాపు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో షాపులోని విలువైన చెక్క సామాగ్రి, సోఫాలు, ఫోమ్ బెడ్స్, ఇతర ఫర్నీచర్ వస్తువులు పూర్తిగా నష్టపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : నెల్లూరులో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి
Follow Us On: X(Twitter)

