కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఫుడ్ పాయిజనింగ్ (Panipuri Food Poisoning) ఘటన కలకలం రేపింది. సిద్ధార్థనగర్ జిల్లాలో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలో పానీపూరీ తిన్న 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. పానీ పూరీ తిన్న తర్వాత వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాధితులు ఆస్పత్రికి వెళ్లారు.
గ్రామానికి చెందిన ఓ వ్యాపారి విక్రయించిన పానీ పూరీ తిన్న చిన్నారుల్లో రెండు రోజుల తర్వాత ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు కలుషితమైన నీరు లేదా పాడైపోయిన ఆహారం కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.

