కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని నగరాన్ని గ్యాస్ ఛాంబర్లా మార్చేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే కేవలం గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, స్థానికులు సమయ పరిమితిని ఉల్లంఘించి రాత్రి 10 గంటల తర్వాత కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీనికి తోడు వాహనాల ఉద్గారాలు, చలి తీవ్రత పెరగడం, గాలి వేగం తగ్గడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తోడవడంతో కాలుష్య కారకాలు, దుమ్ము ధూళి గాలిలోనే నిలిచిపోయాయి. ఫలితంగా విజబిలిటీ దాదాపు 500 మీటర్లకు పడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 366 పాయింట్లుగా నమోదై ‘వెరీ పూర్’ కేటగిరీలో కొనసాగుతోంది. ఢిల్లీలోని 59 కాలుష్య నమోదు కేంద్ర పరిశీలనలో 16 కేంద్రాల్లో AQI 400 పాయింట్లు దాటి అత్యంత ప్రమాదకర కేటగిరీకి చేరగా, 37 కేంద్రాల్లో 300 పాయింట్లకు పైగా నమోదైంది. విషపూరితమైన గాలి కారణంగా స్థానికులు కళ్ళ మంటలు, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. వాయు కాలుష్య పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తోంది.

