కలం, వెబ్ డెస్క్: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం (Egypt Train Collision) చోటుచేసుకుంది. గిజా, ఫయూమ్ మధ్య ప్రయాణిస్తున్న ఓ రైలు.. కైరో నుంచి అస్వాన్‌కు వెళ్తున్న మరో రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 64 మంది గాయపడినట్లు ఈజిప్టు అధికారులు పేర్కొన్నారు. కైరో శివార్లలోని గిజా ప్రావిన్స్ పరిధిలో ఉన్న అల్-అయ్యత్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
రెండు రైళ్లు ఢీకొనడంతో (Egypt Train Collision) ఓ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా మృతి చెందారా అనే విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు.
మరోవైపు, పట్టాలపై అడ్డంగా పడి ఉన్న రైళ్ల బోగీలను తొలగించి రైలు సర్వీసులను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు ఈజిప్టు రైల్వే అథారిటీ వెల్లడించింది. కాగా, గత సెప్టెంబర్‌లోనూ ఇదే అల్-అయ్యత్ ప్రాంతంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.

