కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో ఓఆర్ఆర్‌పై (ORR Accident) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి మొయినాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఒక ఆటో అప్పా జంక్షన్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను సురేష్, పెంటయ్య, లింగరాజు శెట్టిలుగా పోలీసులు గుర్తించారు.ప్రమాద సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి దాదాపు 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఢీకొట్టిన తీవ్రతకు ఆటో తీవ్రంగా దెబ్బతినగా, మిగిలిన ప్రయాణికుల్లో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమా లేదా ఓవర్‌లోడింగా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

