కలం, వెబ్ డెస్క్: ఇటీవలే ‘అర్నాబ్’, ‘మురసు’ తుఫాన్ల ధాటికి తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌ను (AP Weather) మరోసారి వర్షాలు కలవరపెడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13వ తేదీ నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ నవంబర్ 15 నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 24 నుంచి 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం నెలకొని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో (గరిష్ఠంగా 50 కిమీ) ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింి. రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేడు పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడవచ్చని తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా రైతులు, తీరప్రాంత ప్రజలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలో వీచే ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

