కలం, వెబ్ డెస్క్: నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పుట్టిన రోజు. 57 ఏళ్ల పుట్టిన రోజు వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి తన ఇలాకా కొండగల్ లో జరగనున్నాయి. స్థానిక నాయకులు, శ్రేణుల మధ్య ఈ వేడుక చేసుకోనున్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా మాటామంతీ నిర్వహించనున్న సీఎం.. వారి సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కొడంగల్ పరిధిలో పలు కీలక అభివృద్ధి పనులకు ఆయన అధికారికంగా శంకుస్థాపనలు చేశారు.
ఇదే వేదికపై నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘చేయూత’ పింఛన్ల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దీపావళి పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అర్హత సాధించిన 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఈ చేయూత పథకం కింద పింఛన్లను అందించనున్నారు. కొడంగల్లో సీఎం ప్రారంభించిన అనంతరం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఈ పథకం ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత మరియు కల్లుగీత కార్మికులకు ఆర్థిక చేయూత లభించనుంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల నుంచే పింఛన్ సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు వెల్లడించారు. సొంత నియోజకవర్గంలో భారీ అభివృద్ధి పనులకు రూకలు కేటాయించడంతో పాటు కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

